సీఎస్ కు అందించిన విద్యా కమిషన్
హైదరాబాద్ – రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆహార భద్రత, నాణ్యతకు సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో బృందం పర్యటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లోని వందలాది ప్రభుత్వ పాఠశాలలు, నివాస విద్యా సంస్థలు (గురుకులాలు), హాస్టళ్లు, కేజీబీవీలు, అంగన్ వాడీ కేంద్రాలను సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. పూర్తి నివేదికను సీఎస్ శాంతి కుమారికి అందజేశారు.
విద్యార్థులు తమ గోడు వెళ్ల బోసుకున్నారు. ఉపాధ్యులు, ఇతర సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. చైర్మన్ ఆకునూరి మురళితో పాటు సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు, డాక్టర్ చారకొండ వెంకటేష్, జ్యోత్స్న శివారెడ్డి కలిసి పర్యటించారు.
మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆహార నాణ్యత, భద్రత, మౌలిక సదుపాయాలు, పారిశుధ్యానికి సంబంధించిన లోపాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత కమిషన్ ప్రభుత్వానికి వివరణాత్మక నివేదికను సిద్ధం చేసింది. దీనిలో భాగంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజన పథకం, ఆహార నాణ్యత, భద్రతపై సిఫార్సులు అనే నివేదికను తయారు చేసింది.