వజ్ర కిరీటం, త్రీ డైమెన్షనల్ వేంకటేశ్వరుడు
తిరుపతి – ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ప్రాంగణం మొత్తం రంగురంగుల విద్యుత్ దీపాలతో అలరారుతోంది. దీనికి ఏకశిలా నగరం అని పేరు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఎలక్ట్రికల్, గార్డెన్ విభాగాలు చేపట్టిన పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆలయ సముదాయం, కళ్యాణ వేదిక వద్ద అద్భుతమైన ట్రస్ లైటింగ్‌తో ఏర్పాటు చేశారు.
దేవాలయం, కల్యాణ వేదికలను కలుపుతూ రహదారుల వద్ద వివిధ దేవతామూర్తులతో కూడిన 10 పెద్ద, 30 చిన్న విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇందులో లక్ష్మీ వెంకటేశ్వర, సీతా రామ, శ్రీరామ పట్టాభిషేకం, మహా విష్ణువు, విశ్వరూపం, దశావతారాలు వంటి పెద్ద కటౌట్లు ఉన్నాయి.
అదే విధంగా అష్టలక్ష్ములు తుంబురుడు అన్నమాచార్యులు వంటి చిన్న కటౌట్లు ఏర్పాటు చేశారు. గోపురం దీపాలంకరణ, ప్రాకారం చుట్టుపక్కల దీపాలంకరణ, శ్రీవేంకటేశ్వర స్వామి త్రీ డైమెన్షనల్ దీపాలంకరణ, ఆలయం వద్ద ఒకటి, కల్యాణ వేదిక వద్ద మరొకటి విద్యుత్ డైమండ్ కిరీటాల నమూనా భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
దాదాపు 100 మంది కార్మికులు ఈ విద్యుత్ అలంకారాలను తయారు చేయడానికి నెల రోజుల పాటు రాత్రింబవళ్ళు శ్రమించారు.శుక్రవారం సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు సీతా రామ కల్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ప్రధాన ఆలయానికి సమీపంలో రెండు మరియు కల్యాణ వేదిక లోపల, చుట్టుపక్కల 23 ఎల్ ఈడి స్క్రీన్‌లుసిద్ధంగా ఉన్నాయి.
అత్యుత్తమ ఆడియో కోసం, లైన్ అర్రే సౌండ్ మెకానిజంతో రేడియో, బ్రాడ్ కాస్టింగ్ ఏర్పాటు చేయబడింది. భక్తులకు వేసవి తాపం నుండి ఉపశమనం కలిగించి చల్లగా ఉంచడానికి దాదాపు 350 ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారు. కల్యాణ వేదిక ప్రధాన వేదికపై కూడా ఏసీ, ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారు.
ఈ ఏర్పాట్లను ఎస్ఈ ఎలక్ట్రికల్ వెంకటేశ్వరులు ప్రత్యక్ష పర్యవేక్షణలో డీఈలు రవిశంకర్ రెడ్డి, శ్రీమతి సరస్వతి ఆధ్వర్యంలో డెప్యూటీ ఈఈ వెంకటరత్నం, ఏఈ శ్రీ రాజేష్, దొరైరాజ్ మరియు వారి బృందం ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.