సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
ప్రకటించిన కేంద్ర ఎన్నికల కమిషనర్
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ను ఖరారు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. న్యూఢిల్లీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఈ విషయాన్ని వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కూడా పాల్గొన్నారు.
143 కోట్ల మందికి గాను 97 కోట్ల మంది ఓటర్లుగా నమోదైనట్లు వెల్లడించారు రాజీవ్ కుమార్. దేశంలో 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ జూన్ 16 తో ముగుస్తుందన్నారు. అందుకే ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేయాల్సి వచ్చిందన్నారు.
ఇదిలా ఉండగా కొత్తగా 18 ఏళ్లు పూర్తయిన ఓటర్లు 1.8 కోట్ల మంది ఉన్నారని స్పష్టం చేశారు ఎన్నికల కమిషనర్. 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. వీరితో పాటు 88.4 లక్షల మంది వికలాంగులు ఉండగా 48,000 మంది ట్రాన్స్ జెండర్లు ఓటర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. 1.5 కోట్ల మంది పోలింగ్ అధికారులను నియమించనున్నట్లు స్పష్టం చేశారు. 55 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించనున్నట్లు చెప్పారు సీఈసీ.
భారత ఎన్నికల సంఘం 17 సాధారణ ఎన్నికలు మరియు 400 అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించింది . కాగా ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా అసెంబ్లీల పదవీ కాలం కూడా జూన్‌తో ముగియనుందని చెప్పారు.