సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్
విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ – దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం తొలి నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 102 నియోజకవర్గాలకు సంబంధించి జారీ చేసింది.
ఈనెల 27 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 30న నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఉంటుందని ఈసీ తెలిపింది. ఇక వచ్చే నెల ఏప్రిల్ 19న 102 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతుందని స్పష్టం చేసింది ఈసీ.
తొలి విడతకు సంబంధించి తమిళనాడు రాష్ట్రంలో 39 లోక్ సభ స్థానాలకు, రాజస్థాన్ లో 12, ఉత్తర ప్రదేశ్ లో 8, మధ్య ప్రదేశ్ లో 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ , అస్సాంలలో 5 స్థానాలకు తొలి విడత పోలింగ్ జరుగుతుందని పేర్కొంది.
వీటితో పాటు బీహార్ లో 4 నియోజకవర్గాలు, పశ్చిమ బెంగాల్ లో 3, అరుణాచల్ ప్రదేశ్ , మణిపూర్ , మేఘాలయలో 2 స్థానాలకు , ఛత్తీస్‌గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర.. అండమాన్ నికోబార్, జమ్ము కశ్మీర్, లక్ష ద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతుందని స్పష్టం చేసింది కేంద్ర ఎన్నిలక సంఘం.
దేశంలో మొత్తం 7 దశల్లో పోలింగ్ జరుగుతుందని పేర్కొంది. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1న ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్. జూన్ 4న ఓట్లు లెక్కిస్తామని చెప్పారు. దేశ వ్యాప్తంగా 97 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నట్లు తెలిపారు.
ఇందులో పురుష ఓటర్లు 49 కోట్లు, మహిళలు 47 కోట్లు ఉన్నారని, కోటి 80 లక్షల మంది కొత్తగా ఓటర్లు నమోదయ్యారని పేర్కొన్నారు. ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలు వాడుతున్నామని, 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కోటిన్నర మంది సిబ్బంది, సెక్యూరిటీ విధులు నిర్వహించ బోతున్నట్లు స్పష్టం చేశారు.