హోటల్ యజమానులకు ఎఫ్ఓఎస్ టిఏసి శిక్షణ
తిరుమల – తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు ఆరోగ్య కరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడంతో పాటు వారి ఆరోగ్య భద్రతకు టిటిడి అత్యంత ప్రాధాన్యత అని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు.
ఈవో జె. శ్యామలరావు ఆదేశాల మేరకు టిటిడి ఆరోగ్య విభాగం, ఆహార భద్రత విభాగాలతో కలిసి తిరుమలలోని హోటళ్ల నిర్వాహకులకు, యజమానులకు తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ సత్సంగం హాల్లో శిక్షణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్బంగా అదనపు ఈవో మాట్లాడారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే వేలాది మంది భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం హోటళ్ళను నిర్వహించాలన్నారు. హోటళ్ల లోపల పరిశుభ్రత, ఆహార పదార్థాలు నిల్వ చేయడం, వడ్డించడం వంటి విధానాలను ఎప్పటికప్పుడు పరిశీలించి క్రమబద్ధీకరించడం, తదితర విషయాలను నిశితంగా పరిశీలించాలని స్పష్టం చేశారు.
న్యూ ఢిల్లీకి చెందిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్టిఫైడ్ ట్రైనర్ సిహెచ్ ఆంజనేయులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఫుడ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో అన్ని రెస్టారెంట్‌లు, తినుబండారాలలో అనుసరించాల్సిన పరిశుభ్రత, పారిశుద్ధ్య పద్ధతులు, ఆహారం చెడి పోవడం వల్ల కలిగే భౌతిక-రసాయన-జీవ ప్రమాదాలు, వృధా వంటి వాటి గురించి వివరించారు, నిబంధనలను ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలు వంటి అనేక అంశాలను తెలియజేశారు.
టీటీడీ ఆరోగ్య శాఖ డిప్యూటీ ఈవో ఆశాజ్యోతి మాట్లాడుతూ, ఇక నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి తిరుమలలో హోటళ్ల వ్యాపారులందరికీ ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల హెల్త్ ఆఫీసర్ మధుసూధన్ రావు, తిరుపతి జిల్లా ఫుడ్ కంట్రోలర్ జి. వెంకటేశ్వరరావు, తిరుమల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జగదీష్, తిరుమలలోని హోటళ్ల వ్యాపారులు, టిటిడి అన్నప్రసాదం సిబ్బంది పాల్గొన్నారు.