శ్రీవారి పుష్కరిణీ ఏర్పాట్లపై ఈవో తనిఖీ
12న తిరుమలలో చక్ర స్నానం
తిరుమల – కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమల కళ కళ లాడుతోంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఈనెల 12న శనివారం నాటితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు తండోప తండాలుగా తరలి వస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా శనివారం చక్ర స్నానం నిర్వహించారు. దీనిని పురస్కరించుకుని తిరుమల ఆలయం ప్రాంగణంలోని శ్రీవారి పుష్కరిణిలో చేస్తున్న ఏర్పాట్లపై తనిఖీ చేశారు ఈవో జె. శ్యామల రావు.
ప్రవేశ మార్గాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎన్టీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది, శ్రీవారి సేవకులను సమన్వయం చేసుకుని చక్రస్నాన సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఈఓ సీహెచ్.వెంకయ్య చౌదరి, జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్వో శ్రీధర్ పాల్గొన్నారు.