శ్రీవారి భక్తుల సౌకర్యాలపై ఈవో ఆరా
పరిశీలించిన ఏఈవో..జేఈవో చౌదరి..గౌతమి
తిరుమల – టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో గౌతమితో కలిసి తిరుమలలోని పలు ప్రాంతాలను పరిశీలించి, పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
మొదట అన్నమయ్య భవనంలోని ఏపిటిడిసి నడుపుతున్న హోటల్‌ని, పిఎసి-2, మాధవ నిలయాన్ని పరిశీలించి, నిర్మాణంలో ఉన్న కొత్త పిఎసి -5ని కూడా తనిఖీ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు ఉండేలా నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
అంతకు ముందు ఎస్వీ మ్యూజియంను ఆధునీకరిస్తున్న టిసిఎస్ బృందంతో కలిసి సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు.
అనంతరం పాంచజన్యం వసతి గృహం వద్ద నూతన వంటశాల, బయట ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, విక్యూసీ కంపార్ట్‌మెంట్లు, అక్షయ కిచెన్‌లను ఈఓ పరిశీలించారు. కంపార్ట్‌మెంట్లలో యాత్రికులతో మాట్లాడి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో సిఈ నాగేశ్వరరావు, ఎస్ఈ 2 జగదీశ్వర్ రెడ్డి, డీఈ ఎలక్ట్రికల్ రవిశంకర్ రెడ్డి, మ్యూజియం ఇంచార్జి అధికారిణి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.