DEVOTIONAL

బ్ర‌హ్మోత్స‌వాలు ఘనంగా జ‌ర‌గాలి

Share it with your family & friends

టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి సూచ‌న‌

తిరుప‌తి – వ‌చ్చే నెల ఏప్రిల్ లో ఒంటిమిట్ట‌లో జ‌రిగే శ్రీ కోదండ రామ స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని స్ప‌ష్టం చేశారు టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి. ఆల‌యంలో ఏప్రిల్ 16న అంకురార్ప‌ణ‌, 17న 17న శ్రీరామనవమి పర్వదినం కావ‌డంతో ధ్వ‌జారోహ‌ణంతో స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా ప్రారంభం కానున్నాయ‌ని తెలిపారు.

బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడారు. ఏప్రిల్ 22న జ‌రుగ‌నున్న శ్రీ సీతారాముల క‌ల్యాణం ఏర్పాట్ల‌ను వేగ‌వంతం చేయాల‌ని అధికారులను ఆదేశించారు.

క‌ల్యాణం రోజున వ‌చ్చే వేలాది మంది భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన అన్న ప్ర‌సాదం, తాగు నీరు, మ‌జ్జిగ అందించేందుకు చ‌క్క‌టి ఏర్పాట్లు చేయాల‌న్నారు. అన్ని విభాగాలు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందించుకుని క‌ల్యాణం రోజున భ‌క్తుల‌కు అందాల్సిన సౌక‌ర్యాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌ని కోరారు.

ఎండ వేడిమి నుంచి ఉప‌శ‌మ‌నం క‌ల్పించేందుకు భ‌క్తులు న‌డిచే ప్రాంతాల్లో కూల్ పెయింట్ వేయాల‌ని, అవ‌స‌ర‌మైన చోట్ల చ‌లువపందిళ్లు ఏర్పాటు చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. ఊరేగింపు నిర్వ‌హించే వాహ‌నాలు, ర‌థానికి సంబంధించిన ప‌టిష్ట‌త‌ను ప‌రిశీలించి ఫిట్‌నెస్ స‌ర్టిఫికేట్ తీసుకోవాల‌న్నారు.

సీతారాముల త‌లంబ్రాల ప్యాకింగ్‌కు 300 మంది, క‌ల్యాణం రోజున భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదాలు, త‌లంబ్రాల పంపిణీకి దాదాపు 2 వేల మంది శ్రీ‌వారి సేవ‌కుల‌ను సిద్ధం చేయాల‌ని ఆదేశించారు ఈవో ధ‌ర్మా రెడ్డి.

అత్య‌వ‌స‌ర వైద్య ప‌రిస్థితుల్లో వెంట‌నే స్పందించేందుకు వీలుగా అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాల‌ని, ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసి త‌గిన‌న్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచు కోవాల‌ని వైద్య అధికారులకు సూచించారు.

సాంస్కృతిక‌, సంగీత కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన ప్ర‌ణాళిక త్వ‌రిత‌గ‌తిన సిద్ధం చేయాల‌న్నారు. క‌ల్యాణం రోజున భ‌క్తుల‌ ర‌వాణా, వ‌స‌తి, పార్కింగ్‌ క‌ల్పించేందుకు ఆర్‌టిసి అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సూచించారు.

ఈ సమావేశంలో జేఈవో  వీర బ్ర‌హ్మం, సివిఎస్వో న‌ర‌సింహ కిషోర్‌, ఎస్వీబిసి సిఈవో  ష‌ణ్ముఖ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.