ఉప విచారణ కార్యాలయం ప్రారంభం
తిరుమల -శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చే సామాన్య భక్తులకు తిరుమలలో సులభంగా వసతి పొందేలా చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు తెలియజేశారు. తిరుమలలోని గరుడాద్రి నగర్ కాటేజీ వద్ద ఆధునీకరించిన ఉప విచారణ కార్యాలయాన్ని పూజలు నిర్వహించి ప్రారంభించారు. తిరుమలలోని అన్ని వసతి గదులు, విశ్రాంతి గృహాలు వద్ద సర్వే నిర్వహించి మెరుగైన సౌకర్యాలు కల్పించామన్నారు.
తిరుమలలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుమలలోని 42 ఉప విచారణ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు.
అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ గదుల కరెంట్ బుకింగ్ లో కేంద్రీయ విచారణ కార్యాలయంపై అధిక భారం పడుతుండటంతో గదుల కేటాయింపు ప్రక్రియను వికేంద్రికరించినట్లు చెప్పారు. ఉప విచారణ కార్యాలయాల వద్ద గదులు పొందడం, ఖాళీ చేయడం సులభతరమవుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ గౌతమి, సీవీఎస్వో శ్రీధర్, సిఈ సత్య నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.