ప్రకటించిన టీటీడీ ఈవో శ్యామల రావు
తిరుమల – తిరుమలలో కాలం చెల్లిన విశ్రాంతి గృహాల స్థానంలో పునర్ నిర్మాణాలు చేపట్టడానికి కార్యాచరణ రూపొందించాలని టిటిడి ఈవో జె. శ్యామల రావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదనపు ఈఓ శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి సుదర్శన్, గోవర్ధన్, కళ్యాణి, సి-టైప్ క్వార్టర్లు, పద్మావతి ప్రాంతంలోని కొన్ని ప్రదేశాలను అధికారులతో కలిసి విశ్రాంతి గృహాల తాజా పరిస్థితిని పరిశీలించారు.
సాధారణ భక్తుల సౌకర్యార్థం సదరు ప్రదేశాలలో విశ్రాంతి గృహాలను పునర్ నిర్మించడానికి నిర్దిష్ట ప్రణాళికను రూపొందించాలని సీఈ సత్యనారాయణను ఆదేశించారు ఈవో. సదరు విశ్రాంతి గృహాలన్నీ 6 దశాబ్దాల క్రితం నిర్మించడంతో వర్షాకాలంలో లీకేజీలతో భక్తులు అవస్థలు పడుతున్నారు.
సరైన పార్కింగ్ సదుపాయాలు, విశాల స్థలం లేవు. భవన నిర్మాణాలు పాత పద్దతిలో నిర్మించడం మూలంగా భవనాల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. పాత భవనాలలో లీకేజీలు, అపరిశుభ్రత, పార్కింగ్ తదితల అంశాలపై భక్తుల నుండి క్రమం తప్పకుండా టిటిడికి ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా భవణాలను పునర్ నిర్మాణాలు చేయాల్సి ఉందని ఇంజనీరింగ్ అధికారులకు ఈవో సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు భాస్కర్, హరీంద్రనాథ్, ఈఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.