తిరుమలలో టీటీడీ ఈవో విస్తృత తనిఖీలు
డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్త తొలగింపు
తిరుమల – తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఈవో జె.శ్యామలరావు , అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందుగా గోగర్భం జలాశయం సమీపంలోని కాకులమాను దిబ్బ వద్ద ఉన్న డంపింగ్ యార్డును పరిశీలించారు. అక్కడ దశాబ్దాలుగా పేరుకు పోయిన చెత్తను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడారు. తిరుమలలో 30 సంవత్సరాల నుంచి పేరుకు పోయిన లక్ష మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించేందుకు అని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పేరుకు పోయిన చెత్త వల్ల దుర్వాసన రాకుండా చర్యలు చేపట్టామని, సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను తరలించేందుకు తిరుపతి మున్సిపాలిటీ అధికారులతో చర్చించామని, మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికే డంపింగ్ యార్డును సందర్శించినట్లు తెలిపారు.
మూడు, నాలుగు నెలల్లో చెత్తను మొత్తం తొలగిస్తామన్నారు. భవిష్యత్తులో వచ్చే చెత్తను శాస్త్రీయంగా డంపు చేసే విధానం అమలు చేస్తామన్నారు. తడి చెత్త కూడా వేల టన్నులు ఉందని, ఐఓసీఎల్ బయో గ్యాస్ ప్లాంటు అందుబాటులోకి వస్తే తడి చెత్త తగ్గుతుందన్నారు. ఇప్పటికే తడి చెత్త ద్వారా 20వేల టన్నుల కంపోస్టు తయారు చేశామన్నారు.
అనంతరం పాప వినాశనం చేరుకున్న ఈవో మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకొను గదులు, పార్కును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఫారెస్టు అధికారులతో మాట్లాడి పార్కును అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పాప వినాశనంలోని సూచీ బోర్డులను రీ పెయింటింగ్ చేయాలని సూచించారు. పాప వినాశనం టోల్ గేట్ వద్ద జారీ చేసే టోల్ రశీదులను తనిఖీ చేశారు.
అనంతరం ఆకాశగంగ తీర్థాన్ని పరిశీలించి భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆకాశగంగ మెట్ల మార్గంలో భక్తుల రాక పోకలకు అంతరాయం కలగకుండా దుకాణాల ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు.
ఈ తనిఖీల్లో టీటీడీ సిఈ సత్యనారాయణ, ఈఈ సుధాకర్ ,ట్రాన్స్ పోర్ట్ జీఎం శేషారెడ్డి, డిప్యూటీ సీఎఫ్ శ్రీనివాస్ ,డిప్యూటీ ఈవో ఆశాజ్యోతి, వీజీవో సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.