Monday, April 21, 2025
HomeDEVOTIONALతిరుమలలో ఈవో విస్తృత తనిఖీలు

తిరుమలలో ఈవో విస్తృత తనిఖీలు

పాల్గొన్న అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి

తిరుమ‌ల – టిటిడి ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని సిఆర్‌ఓ జనరల్ , నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్‌లను తనిఖీ చేశారు.

అనంతరం ఈవో శ్యామ‌ల రావు మీడియాతో మాట్లాడారు. గత మూడు రోజులుగా వరుస సెలవులు, పురటాసి మాసం రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరగడం జ‌రిగింద‌న్నారు.

ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులకు దాదాపు 20 నుండి 24 గంటల సమయం శ్రీవారి దర్శనానికి పడుతోందన్నారు. కావున దర్శనం కోసం భక్తులు తమ వంతు వచ్చే వరకు ఓపికతో వేచి ఉండాలన్నారు.

వైకుంఠం కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్‌లు, బయట క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్న ప్రసాదం, తాగు నీరు, పాలు, టీ, కాఫీలను టీటీడీ యాజమాన్యం నిరంతరాయంగా అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

భక్తుల సౌకర్యార్థం ఈ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను కూడా టీటీడీ నియమించిందని చెప్పారు ఈవో జె. శ్యామ‌ల రావు.

అంతకుముందు నారాయణగిరి షెడ్లు, బయట క్యూ లైన్ల వద్ద అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు పంపిణీని పరిశీలించారు. సి ఆర్ వో వెనుక భాగాన యాత్రికులు వేచి ఉండేలా ఒక వెయిటింగ్ హాల్ ను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆ తర్వాత, ఆయన సిఆర్ఓ వద్ద ఉన్న యాత్రికుల సమాచార కౌంటర్‌ను పరిశీలించారు. యాత్రికులకు వసతి , ఇతర సౌకర్యాలపై మెరుగైన సమాచారం ఎలా తెలియ జేయాలనే దానిపై సంబంధిత సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో సిఈ సత్యనారాయణ, డిప్యూటీవోలు భాస్కర్, హరేంద్రనాథ్, వి ఎస్ ఓ సురేంద్ర, సిపిఆర్వో డాక్టర్‌ టి.రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments