లడ్డూ వివాదంపై టీటీడీ ఈవో నివేదిక
ఏపీ సీఎం చంద్రబాబుకు అందజేత
అమరావతి – తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఈ తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ముఖ్య కార్య నిర్వహణ అధికారి జె. శ్యామల రావు కీలకమైన నివేదికను తయారు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇందులో భాగంగా ఈవో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై జె. శ్యామల రావు నివేదిక అందజేశారు. ఆగమ సలహా మండలి ఇచ్చిన సూచనలను మాత్రమే పరిగణలోకి తీసుకుని వాటినే ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉండగా పూర్తి నివేదిక అందిన తర్వాత ఈ మొత్తం వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా టీటీడీ ప్రాథమిక రిపోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసింది. అంతే కాకుండా అక్టోబర్ నెలలో తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు ఈవో జె. శ్యామల రావు. అయితే టీటీడీ ఈవో నిన్న అందించిన ప్రాథమిక నివేదికపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు.