అందించిన ఈవో జె. శ్యామల రావు
తిరుపతి – శ్రీవారి భక్తులకు విశిష్ట సేవలు అందించిన టీటీడీ ఉద్యోగులను ప్రశంసించారు ఈవో జె. శ్యామల రావు. వివిధ విభాగాలకు చెందిన 36 మంది అధికారులు, 267 మంది ఉద్యోగులు, ఎస్వీబీసీలో 7 మంది సిబ్బందికి 5 గ్రాముల శ్రీవారి వెండి డాలర్ తో పాటు ప్రశంసా పత్రం అందజేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన శ్రీవారి భక్తుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం అందజేశామని చెప్పారు.
ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్‌వో వై.సతీష్ కుమార్ పెరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. అనంతరం టీటీడీ ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.
టీటీడీ నిఘా, భద్రత విభాగం ఆధ్వర్యంలో జాగిలాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డాగ్ స్క్వాడ్ ఇన్‌చార్జి శ్రీ అమర్‌నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. విరాట్, శింబా, బ్యూటీ అనే జాగిలాలు పాల్గొన్నాయి.
ఇందులో గ్రూప్ డ్రిల్, పేలుడు పదార్థాలను, మాదక ద్రవ్యాలను గుర్తించడం, సైలెంట్ డ్రిల్, వస్తువులను జాగ్రత్తగా కాపాడడం, పారిపోతున్న సంఘ విద్రోహులను గుర్తించి నిలువరించడం తదితర ప్రదర్శనలను జాగిలాలు ఇచ్చాయి.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థినులు “ భవతు భారతం…”, “ అమ్మమ్మ ఏమమ్మ…”, “సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా హమ్ బుల్ బులే హై ఇస్…..” తదితర దేశభక్తి గీతాలకు చక్కటి నృత్యం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా|| వి.కృష్ణవేణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవో వి. వీరబ్రహ్మం, డిఎల్‌వో వరప్రసాద్ రావు, సిఇ సత్యనారాయణ, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజి, సిపిఆర్వో డా.టి.రవి, అదనపు సివిఎస్వో శివ కుమార్ రెడ్డి అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.