ఏర్పాటు చేస్తామన్న ఈవో జె. శ్యామల రావు
తిరుమల – తిరుమలలో హోటళ్ల నిర్వహణపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు టీటీడీ ఈవో జె. శ్యామల రావు. ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హోటళ్లలో తినుబండారాలపై ఫిర్యాదులు, సూచనల పెట్టె (బాక్సు) ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తిరుమలకు వచ్చే భక్తులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో పెద్ద, చిన్న హోటళ్లతో సహా అన్ని తినుబండారాల విక్రయ ప్రాంతాలలో వ్యర్థాలను తొలగించేందుకు రెండు చెత్త బిన్ల వ్యవస్థను నిర్వహించాలని ఆదేశించారు. భక్తుల నుండి అభిప్రాయాన్ని పొందడానికి ఫిర్యాదులు/సూచనల పెట్టెను ఏర్పాటు చేయాలన్నారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో పెద్ద, జనతా క్యాంటీన్లు, ఏపీటీడీసీ హోటళ్లపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కీలక మీటింగ్ లో అడిషనల్ ఏఈవో వెంకయ్య చౌదరి, జేఈవోలు వీర బ్రహ్మం, గౌతమి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమలలోని అన్ని హోటళ్లలో చెత్తను తడిచెత్త, పొడి చెత్తగా సేకరించాలన్నారు. తమ హోటల్ ఆవరణలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తరలించాలన్నారు.
హోటళ్ళు ఆహార పదార్థాల ధరలతో ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు క్రింది మార్గదర్శకాలను పాటించాలన్నారు. హోటల్ లైసెన్స్ పొందిన వారు వాటిని ఇతరులకు సబ్ లీజ్ కు ఇవ్వ కూడదని స్పష్టం చేశారు ఈవో.
అదేవిధంగా పెద్ద, జనతా క్యాంటీన్లు తప్పనిసరిగా తమ హోటళ్ల పేర్లను ప్రదర్శించాలని ఆదేశించారు. సవరించిన ధరలను రెవెన్యూ విభాగానికి సమర్పించాలని సూచించారు.