తెలంగాణలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం
బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందని ఆరోపించారు.
ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలన గాడి తప్పిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా ముఠా నాయకుడిగా ప్రవర్తిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు ఎర్రోళ్ల శ్రీనివాస్.
ముఖ్యమంత్రికి పాలన చేతకాక అసహనంతో ఆటవిక భాష మాట్లాడుతున్నాడని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అశాంతి లేపే కుట్రకు తెర లేపుతున్నాడని మండిపడ్డారు.
చిన్న పోస్టు పెడితేనే తమ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పోలీసులు నమోదు చేస్తున్నరని ఆరోపించారు.
తొక్కుతా చంపుతా అంటూ సీఎం స్థాయిలో బజారు భాష మాట్లాడం వల్ల కింది స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలను హింస చేయడానికి ప్రేరేపిస్తున్నదని, దీనిని తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు.
రేవంత్ పై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు ఎర్రోళ్ల శ్రీనివాస్.