ఏపీలో కూటమి గాలి
ఈటీజీ సర్వే తాజా వెల్లడి
అమరావతి – ఏపీలో జరగబోయే శాసన సభ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారనే దానిపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నడుస్తోంది. ఇది కాదనలేని సత్యం. ఇప్పటికే జాతీయ మీడియాతో పాటు సర్వే సంస్థలన్నీ గంప గుత్తగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే ఈసారి పవర్ రానుందని చెబుతున్నాయి. అయితే మరికొన్ని సంస్థలు మాత్రం తిరిగి మరోసారి జగన్ రెడ్డి సీఎం కాక తప్పదని స్పష్‌టం చేస్తున్నాయి.
తాజాగా మంగళవారం ట్విట్టర్ వేదికగా ఈటీజీ రీసెర్చ్ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈసారి టీడీపీ కూటమికి భారీ ఎత్తున సీట్లు రానున్నట్లు తెలిపింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను కూటమికి కనీసం 110 నుంచి 120 సీట్లు రాబోతున్నాయని వెల్లడించింది. ఇక జనసేన పార్టీకి 18 నుంచి 20 సీట్లు వస్తాయని తెలిపింది.
విచిత్రం ఏమిటంటే వై నాట్ 175 అన్న స్లోగన్ తో ముందుకు వెళుతున్న జగన్ రెడ్డికి సదరు సంస్థ కేవలం కొన్ని సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొనడం గమనార్హం. వైసీపీకి 24 నుంచి 27 సీట్లు వస్తాయని, బీజేపీకి 5 నుంచి 6 సీట్లు దక్కుతాయని చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు దక్కనున్నట్లు తెలిపింది.
ఇక ఓటు వాటా పరంగా చూస్తే కూటమికి 54.75 శాతం రాగా వైసీపీకి 36 శాతం , కాంగ్రెస్ కు 5 శాతం , ఇతరులకు 4.25 శాతం వచ్చినట్లు స్పష్టం చేసింది.