మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి డిమాండ్
అమరావతి – దివంగత మాజీ ఎంపీ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షి వాచ్ మెన్ రంగన్న అనుమానాస్పద మృతిపై లోతుగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు మాజీ ఎమ్మల్సీ బీటెక్ రవి. ఇదే అంశంపై సంచలన కామెంట్స్ చేశారు కడప జిల్లా ఎస్పీ చెప్పారని తెలిపారు. ఆనాడు జగన్ సర్కార్ వివేకాపై గొడ్డలి పోటును గుండె పోటుగా చిత్రీకరించారని ఆరోపించారు. ఇదే సమయంలో దివంగత పరిటాల రవి హత్య కేసులో సాక్షులలో ఒక్కొక్కరిని నామ రూపాలు లేకుండా చంపేశారని మండిపడ్డారు. అదే విధంగా సాక్షులను లేకుండా చేస్తున్నారంటూ పేర్కొన్నారు.
వివేకానంద రెడ్డి దారుణ హత్యతో సంబంధం ఉన్న కసనురు శ్రీనివాస్ రెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, డ్రైవర్ నారాయణ, ఈసీ గంగి రెడ్డి, అభిషేక్ రెడ్డిలంతా అనుమానాస్పదంగా మృతి చెందారని, ఈ లోకం నుండి లేకుండా చేశారని, దీని వెనుక పెద్ద ఎత్తున కుట్ర దాగి ఉందంటూ బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. కాగా వివేకా హత్య కేసులో వాంగ్మూలం కూడా ఇచ్చిన అభిషేక్ రెడ్డి 4 నెలలు కోమాలో ఉండి చనిపోయాడని అన్నారు. వాచ్ మెన్ రంగన్న మృతిపై సమగ్ర విచారణ చేసి నిజానిజాలు నిగ్గు తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి.