అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల – తిరుమలలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలోని పలు ప్రాంతాలను అదనపు ఈవో, జెఈవో వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ సుబ్బ రాయుడు, సివిఎస్వో శ్రీధర్‌తో కలిసి పరిశీలించారు.
అనంతరం అదనపు ఈవో మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ద్వారా దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ అధికారులు, విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు.
జనవరి 10, 11, 12వ తేదీలలో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కావున ఇందు కోసం అధికారులతో చర్చించి పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. దర్శనానికి విచ్చేసే విఐపిలకు వారికి అందించే పాసులలోనే దర్శన సమయం, పార్కింగ్ ప్రాంతం, ప్రవేశ, నిష్క్రమణ గేట్ల వివరాలు పొందిపరిచనున్నట్లు తెలిపారు.
రాంబగిచా ప్రాంతంలో వాహన పార్కింగ్ ను ఈ రోజులలో బైటకు బదిలాయించినట్లు చెప్పారు. దీనికి బదులుగా 10 బగ్గీలు, అదనపు సిబ్బంది, సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. విఐపిలు, భక్తులు తమకు కేటాయించిన సమయం ప్రకారం మాత్రమే దర్శనానికి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా భక్తులు తమ పాదరక్షలను గదులలో, వారి వాహనాలలో వదలి రావాలన్నారు. అధిక రద్ధీ నేపథ్యంలో తోటి భక్తులకు ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్యాని పాటించాలని, వ్యర్ధాలను టీటీడీ ఏర్పాటు చేసిన డస్ట్ బిన్లలోనే వేయాలని అదనపు ఈవో కోరారు. భక్తులకు సూచించిన నిబంధనలు పాటిస్తూ టీటీడీకి సహాకరించాలన్నారు.
అనంతరం జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ తిరుమల, తిరుపతిలలో వైకుంఠ ఏకాదశికి విచ్చేసే భక్తులకు భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు. తిరుమలలో ట్రాఫిక్‌ను సక్రమంగా నిర్వహించడం, తిరుపతిలోని ఎస్‌ఎస్‌డి కౌంటర్ల వద్ద, ఫుట్‌పాత్ మార్గంలో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడంపై సుదీర్ఘంగా చర్చించినట్లు వివరించారు.
అంతకుముందు అదనపు ఈవో, జిల్లా ఎస్పీతో కలిసి పరకామణి భవనం ప్రక్కన ఉన్న ఖాళీ ప్రాంతం, శ్రీవారి సేవాసదన్ ముందు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనం సమీపంలో ఉన్న పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. తరువాత ఏటిసి వద్ద క్యూలైన్లు, ప్రవేశ మార్గాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.