దాఖలు చేసిన విజయ్ పాల్ రెడ్డి
హైదరాబాద్ – మాజీ సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. గజ్వేల్ నుంచి ఎన్నికైనా అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ లోనే ఉన్నాడని, ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిల్ ను విజయ్ పాల్ రెడ్డి దాఖలు చేశారు. కేసీఆర్ కు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు వేతనంగా చెల్లిస్తున్నారని, వాటిని కూడా రికవరీ చేయాలని కోరారు. ఈ మేరకు కోర్టు స్పీకర్ ను కేసీఆర్ పై వేటు వేసేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు.
ప్రస్తుతం దావా దాఖలు చేసిన విజయ్ పాల్ రెడ్డి ఫార్మర్స్ ఫెడరేషన్ కు చెందిన నాయకుడు. కేసీఆర్ వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందన్నారు. ఆయన వల్ల రాష్ట్రానికి నష్టం తప్ప ఒనగూరిన ప్రయోజనాలు ఏవీ లేవన్నారు.
గత కొంత కాలంగా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించకుండా నిమ్మళంగా ఉండేందుకు తనను ఓటర్లు ఎన్నుకోలేదని పేర్కొన్నారు. గతంలో కూడా పాలనను ఫామ్ హౌస్ నుంచే సాగించారని ఆరోపించారు. దీని వల్ల రాష్ట్రానికి, ప్రజలకు తీరని ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. వెంటనే తనపై అనర్హత వేటు వేస్తే మంచిదన్నారు.