రైతన్నల పోరుబాట ఉద్రిక్తం
పోలీసుల టియర్ గ్యాస్ ప్రయోగం
ఢిల్లీ – తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతులు ఆందోళన చేపట్టారు. పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలి వచ్చారు. దీంతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత్యంతరం లేని పరిస్థితిలో లా అండ్ ఆర్డర్ కట్టు తప్పడంతో వెంటనే టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో రైతులు మరింత రెచ్చి పోయారు. టియర్ గ్యాస్ ప్రయోగించినా ముందుకే సాగారు.
మోడీ ప్రభుత్వం తమను మోసం చేసిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు రైతు సంఘాల నేతలు. ఇది పూర్తిగా సర్కార్ వైఫల్యమేనని ఆరోపించారు. పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా శంభు సరిహద్దు వద్ద కాంక్రీటు దిమ్మెలు, ఇనుప బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. వెంటనే తమతో ప్రధాని మోడీ చర్చించాలని లేక పోతే పార్లమెంట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు రైతులు. మొత్తంగా మరోసారి రైతులు చేపట్టిన పోరాటం చర్చనీయాంశంగా మారింది.