కన్నడ నటుడు రక్షిత్ శెట్టిపై కేసు
కాపీ రైట్ ఉల్లంఘించారని ఎఫ్ఐఆర్
కర్ణాటక – కన్నడ సినీ రంగానికి చెందిన ప్రముఖ నటుడు రక్షిత్ శెట్టికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై కాపీ రైట్ ఉల్లంఘన కింద కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఎంఆర్టీ సంస్థ తరపున నవీన్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.
ఆయన సోమవారం కర్ణాటక లోని యశ్వంత్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నటుడు రక్షిత్ శెట్టిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కాపీ రైట్ ను ఉల్లంఘించినందుకు గాను వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసు కూడా పంపించినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా రక్షిత్ శెట్టి, ఆయనకు చెందిన నిర్మాణ సంస్థ పరమవా స్టూడియోస్ ఇటీవలే బ్యాచిలర్ పార్టీ చిత్రాన్ని రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో న్యాయ ఎల్లిదే, ఒమ్మే నిన్ను పాటలను అనుమతి లేకుండా ఉపయోగించారని సదరు సంస్థ ఆరోపించింది.
కాగా ఈ ఏడాది జనవరిలో హక్కులను పొందేందుకు రక్షిత్ బృందం చర్చలకు ప్రయత్నం చేసిందన్నారు. కానీ చర్చలు విఫలమైనట్లు ఫిర్యాదుదారు పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఉపయోగించడం నేరమని , అందుకే ఫిర్యాదు చేశామన్నారు.