సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్
అమరావతి – ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ తీవ్రంగా స్పందించారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పనిగట్టుకుని తనపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో రూ. 10 లక్షలు ఖర్చు చేయాలన్నా బోర్డు చైర్మన్, సభ్యుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎలా కోట్లు పక్కదారి పడతాయంటూ ప్రశ్నించారు.
కార్పొరేషన్ చైర్మన్ , డీజీపీ, జైల్స్ డీజీ, ఫైర్ డీజీ అందరూ సభ్యులుగా ఉన్న బోర్డ్ ఆమోదం తప్పనిసరిగా సంతకాలు చేయాల్సి ఉంటుందన్నారు. పని విలువని బట్టి అప్పటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించిన మొత్తాన్ని చెల్లించడం జరిగిందన్నారు.
ఇందులో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పాత్ర ఏమీ ఉండదని స్పష్టం చేశారు పీవీ సునీల్ కుమార్. అంతే కాకుండా టెండర్ తుది ఎంపిక కూడా కమిటీ ద్వారా జరుగుతుందన్నారు. అలాగే ప్రభుత్వ పరంగా ఆడిట్ కూడా పరిశీలించడం జరుగుతుందని పేర్కొన్నారు.