మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైఎస్సార్సీపీకి కోలుకోలేని షాక్
అమరావతి – వైసీపీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా ఇంఛార్జ్ పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా వైదొలుగుతున్నట్లు పేర్కొన్నారు. కాగా వ్యక్తిగత కారణాలతో తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు అవంతి శ్రీనివాస్ . కూటమి సర్కార్ కు కొంత సమయం ఇవ్వాలని అన్నారు. వైసీపీ ప్రజల్లోకి వెళ్లడం మంచి పద్దతి కాదన్నారు. పార్టీలో ఎవరికీ వాయిస్ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి.
ఇదే సమయంలో పార్టీ చీఫ్ ,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు టీడీపీ కూటమికి అవకాశం ఇచ్చారని, ప్రజా తీర్పును గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కానీ జగన్ రెడ్డి అవేవీ పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడ పోవడం దారుణమన్నారు అవంతి శ్రీనివాస్.
జగన్ ఆదేశాలు ఇస్తారు..కానీ ఇబ్బందులు పడేది మాత్రం కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలేనని వాపోయారు. ఇకనైనా పార్టీ బాస్ మారితే మంచిదని హితవు పలికారు. కాగా అవంతి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ వైసీపీలో కలకలం రేపుతున్నాయి.