పార్టీని మరింత బలోపేతం చేయాలి
హైదరాబాద్ – బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల సందర్బంగా ఏప్రిల్ 27న బహిరంగ నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ చీఫ్ , మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం ఎర్రవల్లి నివాసంలో జరిగింది. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైందని, దానిని గుర్తించి ప్రజా సమస్యలను ప్రస్తావించాలని పిలుపునిచ్చారు. ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. పాలన గాడి తప్పిందని, జనం రేవంత్ ను సీఎంగా గుర్తించడం లేదన్నారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తన గోతిని తానే తవ్వుకుంటోందన్నారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు కేసీఆర్. ప్రజలకు ఇప్పుడు తెలిసి వచ్చిందని, ఎవరు పనిమంతులనే విషయంపై క్లారిటీ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ వచ్చిందంటేనే కరెంట్ ఉండక పోవడం, నీళ్లు రాక పోవడం తిరిగి మొదలైందన్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు , జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో ఉండే నేతలు, కార్యకర్తలు ప్రజలకు అండగా నిలవాలని, ప్రజా సమస్యలను ప్రస్తావించాలని పిలుపునిచ్చారు కేసీఆర్.