షాకింగ్ కామెంట్స్ చేసిన మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్ – మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిప్పులు చెరిగారు. వారిపై అనర్హత వేటు పడడం ఖాయమని, ఉప ఎన్నికలు జరగడం ఖాయమని జోష్యం చెప్పారు. బీఆర్ఎస్ సత్తా చాటుతుందన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి ఓడి పోతాడని, రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తాడని అన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ధర్మసాగర్ మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లతో పాటు పలువురు నేతలు చేరారు. కేసీఆర్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ తో గెలుపొంది అధికారం కోసం , తమ పదవులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారికి ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు కేసీఆర్ ఈ సందర్బంగా. ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంతో జనం ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.
ఓట్ల కోసం వెళితే ప్రజలు తిరిగి కొట్టే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వాన్ని నడపడం అంత ఈజీ కాదన్నారు. ఉబుసుపోక కబుర్లు చెప్పడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. ప్రజలు విక్షచణ కలిగిన వారని, వారు ఏది అనుకుంటే అది చేస్తారన్నారు. ఎరక్కపోయి ఇరుక్కున్నారని, ఇప్పుడు బీఆర్ఎస్ పాలనే బాగుందనే స్థితికి వచ్చారన్నారు. అందుకే తాను కూడా వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నానంటూ పేర్కొన్నారు కేసీఆర్.