నిప్పులు చెరిగిన మాజీ సీఎం కేసీఆర్
వరంగల్ జిల్లా – ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనం పోటెత్తారు. గులాబీయం అయ్యింది. లక్షలాదిగా జనం తరలి వచ్చారు. అశేష జనవాహినిని ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు , మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ప్రతి ఏడాది రూ. 15 వేల కోట్ల ఆదాయం తీసుకు వచ్చామని, కానీ ఇవాళ ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి జనాన్ని కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందన్నారు. పాలన చేతనకాక దద్దమ్మలు తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న వారు తమకు అప్పులు పుట్టడం లేదంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గత 10 ఏళ్ల కాలంలో దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్దిలోకి తీసుకు వచ్చిన ఘనత తనదేనని అన్నారు.
24 గంటల పాటు నిరంతరం విద్యుత్ ఇచ్చామని, ఇప్పుడు ట్రాన్సాఫర్మర్లు, మోటార్లు కాలి పోతున్నాయని , రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. తమ హయాంలో ఆకాశాన్ని అంటిన భూముల ధరలు ఇప్పుడు ఎక్కడున్నాయంటూ నిలదీశారు కేసీఆర్. తెలంగాణను దగదగలాడే విధంగా, అందరూ ఆశ్చర్య పోయేలా రాష్ట్రాన్ని నిర్మించుకున్నామని చెప్పారు. వడ్లు కొనే దిక్కు లేదని, మంచి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారి పోయిందన్నారు. 2014 కంటే ముందున్న పరిస్థితులు తిరిగి రాష్ట్రంలో వస్తున్నాయని ఆవేదన చెందారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలగొడితే చూస్తూ ఊరుకుందామా అని ప్రశ్నించారు. తాను తెలంగాణను టాప్ లో నిలిపితే కాంగ్రెస్ వచ్చాక దిగజారిందన్నారు కేసీఆర్. రాష్ట్రాన్ని చూస్తే దుఖఃం కలుగుతోందన్నారు. ఈ దుర్మార్గులపై యుద్దం చేయాలన్నారు.