వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు
అమరావతి- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పార్టీ కేంద్ర కార్యలయంలో వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరించారు వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ . దివవగత తన తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్సార్ ఆశయాల సాధన కోసం తాను కట్టుబడి ఉన్నానని ఈ సందర్బంగా ప్రకటించారు జగన్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు తాను ప్రయత్నం చేశానని అన్నారు. గత 5 ఏళ్లలో దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను, కార్యక్రమాలు తీసుకు వచ్చానని చెప్పారు.
డాక్టర్ వైయస్ఆర్ ఆశయాల సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాటి నుంచి నేటి వరకూ తమ భుజస్కందాలపై మోస్తున్న కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, నాయకులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జగన్ రెడ్డి. నా ఒక్కడితో మొదలై, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ప్రజల ఆశీస్సులతో శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఎదిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ సంవత్సరంలోకి అడుగు పెట్టిందన్నారు.
ఈ సుదీర్ఘ కాలంలో పార్టీ నిరంతరం ప్రజలతోనే ఉంది, ప్రజల కోసం పనిచేస్తూనే ఉందన్నారు. అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లలో దేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయని విధంగా సంక్షేమం, అభివృద్ధిని అందించిందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించడం, దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగామన్నారు. విలువలకు విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన పార్టీ పట్ల, నా పట్ల నమ్మకంతో విశ్వాసంతో నాతో నడుస్తున్న పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు జగన్ రెడ్డి.