కేంద్ర సర్కార్ పై మాజీ మంత్రి ఫైర్
అమరావతి – కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2025పై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. 21 మంది ఎంపీల మద్దతుతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న మోదీ సర్కార్ ఏపీ రాష్ట్రంపై వివక్ష చూపడం దారుణమన్నారు. కేంద్రం నుండి రావాల్సిన వాటాను సీఎం నారా చంద్రబాబు నాయుడు విఫలం చెందాడని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన రాయితీలను ఎందుకు పొందలేక పోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీహార్ కు ప్రయోజనం చేకూర్చేలా అత్యధికంగా నిధులు కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తక్కువ సీట్లు కలిగిన బీహార్ కు ఎందుకు అన్ని నిధులు కేటాయించారని నిలదీశారు. దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుపై ఉందన్నారు.
కేంద్ర బడ్జెట్ ఖర్చు మొదటిసారిగా రూ. 50 లక్షల కోట్లు దాటినప్పటికీ, 12 మంది ఎంపీలు ఉన్న బీహార్‌కు మరిన్ని రాయితీలు ఎందుకు లభిస్తాయో, 16 మంది ఎంపీలు ఉన్న టిడిపి ఎందుకు వెనుకబడిందో సీఎం స్పష్టం చేయాలన్నారు.
బీహార్ మౌలిక సదుపాయాలు, సంస్థలు, విమానాశ్రయాలు మరియు ప్రాజెక్టులను పొందగలిగినప్పటికీ, రాష్ట్రానికి మరిన్ని రాయితీలు పొందాలని ఎందుకు ఒత్తిడి తేలేదని ఆయన అన్నారు. తలసరి ఆదాయం తగ్గడంపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడే పారిశ్రామికవేత్తలను భయపెడుతుందని అన్నారు.