మరోసారి కుల గణన సర్వే చేపట్టాలి
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. దమ్ముంటే మరోసారి రాష్ట్రంలో కుల గణన సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. సాకులు వెతకడం ఆపేసి చర్యలు తీసుకోవాలన్నారు. కావాలని బీసీలకు అన్యాయం చేశారని ఆరోపించారు.
తప్పించుకునే ప్రయత్నం చేయడం ఏ మాత్రం మంచి పద్దతి కాదన్నారు. 41 లక్షల మంది బహుజనులు లేకుండా సర్వే ఎలా చేపడతారంటూ ప్రశ్నించారు. గొప్పలు చెప్పుకోవడం మానుకుని ఆచరణాత్మకంగా పని చేయాలన్నారు.
ఆదివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఎంత సేపు తమపై ఆరోపణలు చేయడం, నిరాధారమైన విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు. ప్రజలు ఇప్పటికే గాడి తప్పిన పాలనపై భగ్గుమంటున్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు చేశారో చెప్పాలంటూ నిలదీశారు .
ఒక్క ఫ్రీ బస్సు తప్పిస్తే ఏ ఒక్క హామీ కూడా అమలు చేసిన పాపాన పోలేదన్నారు మాజీ మంత్రి. రైతు బంధు కేవలం మండలానికి ఒక్క గ్రామానికే పరిమితం చేయడం దారుణమన్నారు.