సవాల్ విసిరిన మాజీ మంత్రి కేటీఆర్
వికారాబాద్ జిల్లా – మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం స్వంత నియోజకవర్గం కోడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహా ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా కేటీఆర్ కు భారీ ఎత్తున స్వాగతం పలికారు. రైతులను ఉద్దేశించి ప్రసంగించారు కేటీఆర్.
దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని, మళ్లీ గెలిస్తే తమ పార్టీ అభ్యర్థికి 50 వేల కంటే తక్కువ మెజారిటీ వస్తే తాను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని సంచలన ప్రకటన చేశారు. అడ్డగోలు హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు.
కోడంగల్ నియోజకవర్గంలోనే రుణ మాఫీ కాలేదని, రైతు బంధు పడలేదని ఇక రాష్ట్రంలో ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నించారు కేటీఆర్.
అనుముల అన్నదమ్ముల కోసం, అదానీ కోసం, అల్లుడి కోసమే కొడంగల్ నియోజకవర్గంలో సంవత్సరం నుంచి కురుక్షేత్ర యుద్దాన్ని తలపించేలా రేవంత్ రెడ్డి అరాచకాలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
తన మనుషులకు వేల కోట్ల రూపాయల విలువైన భూములను దోచి పెట్టడానికే లగచర్ల రైతులపై అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. సంవత్సర నుంచి కోడంగల్ లో కురుక్షేత్ర యుద్దం నడుస్తోందన్నారు. 14 నెలల పదవీకాలంలో రైతులు, మహిళలు, వృద్ధులు, యువత కోసం రేవంత్ రెడ్డి ఒక్క పని కూడా చేయలేదన్నారు.