మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ ను ఏకి పారేశారు. మిస్ వరల్డ్ పోటీల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పడంపై మండిపడ్డారు. ఏ విధంగా వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు రూ.54 కోట్లు తప్పా అంటున్నారని, అదే ఫార్ములా- ఈ రేసు పోటీల్లో రూ.46 కోట్లు పెడితే దానిని ఏకపక్షంగా రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఏకపక్షంగా రద్దు చేయడం ఎంత వరకు సబబు అని నిలదీశారు కేటీఆర్.
కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అబద్దాల మీద బతుకుతోందని ఆరోపించారు. ఇప్పటికే అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ని జాబ్స్ ఇచ్చారో చెప్పాలన్నారు. ఇప్పటి వరకు భర్తీ చేసినవన్నీ తాము నోటిఫికేషన్లు ఇచ్చినవేనని పేర్కొన్నారు. ఎంత సేపు ప్రతిపక్షాలపై బురద చల్లడం మానుకోవాలని సూచించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు. ఏ ఎన్నికలు వచ్చినా అంతిమ విజయం గులాబీ పార్టీదేనని స్పష్టం చేశారు కేటీఆర్.