ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్
అమరావతి – వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రన్న పగ, చంద్రన్న దగా అనే పథకాలను ప్రస్తుతం అమలు చేస్తున్నాడని మండిపడ్డారు. కూటమి సర్కార్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా తనను నియమించడం పట్ల జగన్ కు థ్యాంక్స్ తెలిపారు.
ఆదివారం కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ఉద్యమాల పురిటి గడ్డ అనే విషయం చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరిచి పోయారంటూ ఎద్దేవా చేశారు.. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని తమ నాయకుడు జగన్ రెడ్డి చూశాడని చెప్పారు. కానీ కూటమి సర్కార్ వచ్చాక దానిని పక్కన పెట్టిందని ధ్వజమెత్తారు.
తమ నాయకుడు ఒక్కసారి చెప్పాడంటే ఇక మరోసారి వెనక్కి తగ్గేది లేదన్నారు. కానీ చంద్రబాబు ఇచ్చిన మాట తప్పడంలో తనకు తనే సాటి అన్నారు. తాజాగా గ్రూప్ -2 అభ్యర్థులను కూడా మోసం చేశాడని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రజల బాగు కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత జగన్ రెడ్డికి దక్కుతుందన్నారు కురసాల కన్నబాబు.