మాజీ మంత్రి పెద్దిరెడ్డి
అమరావతి – రాష్ట్రంలో కూటమి సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఇంత దారుణమైన పరిపాలనను తాను ఎన్నడూ చూడలేదన్నారు. 10 నెలలు అయినా ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. దీని వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ప్రతి విద్యార్థికి సీఎం చంద్రబాబు రూ. 30 వేలు బాకీ ఉన్నారని అన్నారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జిల్లాల్లో వైసీపీ యువత పోరు కార్యక్రమం చేపట్టిందన్నారు.
బుధవారం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం చేయడం జరిగిందన్నారు. కానీ కూటమి సర్కార్ కొలువు తీరాక అన్నింటికి మంగళం పాడిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత ప్రచారం చేసుకుంటున్నాడే తప్పా ప్రజల కోసం ఒక్క మంచి పని చేయడం లేదంటూ ధ్వజమెత్తారు. సీఎంను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తమ పార్టీ ఏర్పడి 15 ఏళ్లవుతోందని, ఈ సందర్భంగా పార్టీ కోసం పని చేస్తున్న నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.