హైకోర్టును ఆశ్రయించిన పేర్ని నాని
అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వండి
అమరావతి – మాజీ మంత్రి పేర్ని నాని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు హాజరు కావాలంటూ తనకు మచిలీపట్నం పోలీసులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కేవలం కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు కారణాలతోనే అరెస్ట్ చేయాలని చూస్తున్నారని దావాలో పేర్కొన్నారు .
నోటీసులు రద్దు చేసి , తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి పేర్ని నానికి సంబంధించిన గోడౌన్లలో రేషన్ బియ్యం మాయం అయ్యాయంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పేర్ని నానితో పాటు కొడుకు పేర్ని కిట్టు, భార్య పేర్ని జయసుధలకు నోటీసులు కూడా జారీ చేశారు.
నోటీసులు అందజేసే సమయంలో పేర్ని నాని ఇంటికి తాళం వేసి ఉందని, దీంతో గోడలకు నోటీసులు అంటించామని పోలీసులు తెలిపారు. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే గాయబ్ అయ్యారంటూ లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు.
మరో వైపు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి పేర్ని నానిపై. గోడౌన్లలో 4,800 క్వింటాళ్ల రేషన్ బియ్యం మాయం అయ్యాయని ఇందుకు సంబంధించి కేసు నమోదు చేశామన్నారు. ఎక్కడికి వెళ్లినా పట్టుకుని తీరుతామని హెచ్చరించారు.