హెరిటేజ్ నుంచి పేదలకు ఇవ్వొచ్చు కదా
ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర్ రావు. ఇంకెంత కాలం రైతులను మోసం చేస్తారంటూ మండిపడ్డారు. ఇప్పటికే 34 వేల ఎకరాలు తీసుకున్నారని అన్నారు. అంతకు ముందే వాగులు , కొండలు , రోడ్లు అన్నీ కలిపి దాదాపు 58 వేల ఎకరాల విస్తీర్ణం ఉందన్నారు.
సెక్రటేరియట్ , హైకోర్టు , అసెంబ్లీ , పరిపాలనా వ్యవస్థలన్నింటికీ కావాల్సింది 2700 ఎకరాలు మాత్రమేనని చెప్పారు. తాత్కాలికం పేరుతో సెక్రటేరియట్ , హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించారని అదనంగా మరో 44 వేల ఎకరాలు తీసుకుంటామని ప్రకటించడం దారుణమన్నారు. రాజధాని కోసం 31 వేల కోట్లు అప్పు చేసిన మీరు ఇంకా 69 వేల కోట్లు కావాలని చెప్పడం పట్ల ఫైర్ అయ్యారు.
బుధవారం వడ్డే శోభనాద్రీశ్వర్ రావు మీడియాతో మాట్లాడారు. ఇలాంటి ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. రెండు కళ్ల సిద్ధాంతంతో పరోక్షంగా ఉమ్మడి ఏపీ విభజనకు దోహద పడ్డారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా హమీని ఎగ్గొట్టేసిందన్నారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తున్నా చంద్రబాబు సరైన పోరాటం చేయడం లేదన్నారు . ప్రజలకు ఉపయోగ పడేవి వదిలేసి అవుటర్ రింగ్ రోడ్డు , మెట్రో రైలు అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. హైపర్ లూప్ అనే రైలు అమెరికా , జపాన్ , జర్మనీ వంటి దేశాల్లోనే లేదన్నారు.
ఏపీలో హైపర్ లూప్ రైలుకు డీపీఆర్ చేయమని చెప్పడం చంద్రబాబు అనాలోచిత…తొందరపాటు చర్యగా అభివర్ణించారు. పెద్ద పెద్ద ధనవంతులకు , కార్పొరేట్లను బాగు చేయడం కోసం ఇలాంటివి చేయడం సరికాదన్నారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో పేదలను గాలికి వదిలేశారని ఆవేదన చెందారు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్లకు మేలు జరిగేలా పని చేస్తున్నారని ఆరోపించారు. మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ 44 వేల ఎకరాలు తీసుకుంటున్నారా చంద్రబాబు అని సూటిగా ప్రశ్నించారు. మీకు చేతనైతే నారాయణ , భాష్యం విద్యా సంస్థల్లో పది శాతం పేద విద్యార్ధులకు సీట్లు ఇప్పించాలన్నారు. పేదల కోసం హెరిటేజ్ నుంచి మీరేమీ ఇవ్వరా.. అని నిలదీశారు.