మాజీ మంత్రి విడుదల రజిని
అమరావతి – మాజీ మంత్రి విడదల రజిని నిప్పులు చెరిగారు. తనపై ఏసీబీ కేసు నమోదు చేయడం, ఏ1గా చేర్చడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది పూర్తిగా కూటమి సర్కార్ కావాలని కక్ష సాధింపు ధోరణితో చేసిందంటూ ఆరోపించారు. ఆధారాలు లేకుండా కేసులు పెడుతోందన్నారు. బీసీ మహిళ అయిన తనను రాజకీయంగా ఎదగకుండా చేసేందుకు ఇలా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వాళ్లు ఎదుగుతుంటే తట్టుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు రజిని.
ఆదివారం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాశానని చెప్పారని, ఇందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో వారిని తప్పకుండా అరెస్ట్ చేసి తీరుతామని ఇప్పటికే ప్రకటించారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఇప్పటికే వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఆయన ఇంకా బయటకు రాలేదు. ఇక వివాదాస్పద నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అయి నిన్న రాత్రే రిలీజ్ అయ్యారు. పేర్ని నాని ప్రస్తుతం ముందస్తు బెయిల్ తో బయట ఉన్నారు. తాజాగా విడదల రజిని చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.