బీసీలకు అన్యాయం ఇంకెంత కాలం..?
నిప్పులు చెరిగిన విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ – తరాలు మారినా బీసీల బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్. సోమవారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల సమరభేరి లో పాల్గొని ప్రసంగించారు.
మేమెంతో మాకంత – జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్రం ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని అన్నారు వి. శ్రీనివాస్ గౌడ్. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తేనే సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందన్నారు.
అత్యధికంగా ఓటు బ్యాంకు కలిగిన బీసీలకు సముచిత స్థానం ఇవ్వక పోవడం దారుణమన్నారు. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా బీసీలకు సరైన ప్రయారిటీ ఇవ్వడం లేదని వాపోయారు విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్.
రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించకుండా ఇబ్బందులు కల్పిస్తున్నారని మండిపడ్డారు. ఆధిపత్య కులాలు, వర్గాలు కావాలని , పనిగట్టుకుని బీసీల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి. మా కోటా మా వాటా అన్న నినాదంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.