నిప్పులు చెరిగిన గుమ్మడి నర్సయ్య
హైదరాబాద్ – ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగుసార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నం చేశానని, కానీ ఇప్పటి వరకు అనుమతి ఇవ్వడం లేదంటూ వాపోయారు. తన వద్ద పనిచేస్తున్న పీఎస్ జైపాల్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడని, అసలు ఈ సీఎం ఎవరి కోసం ఉన్నారంటూ ప్రశ్నించారు. ఎన్ని సార్లు వచ్చినా గేటు వద్దే నిలిపి వేస్తున్నారని ఆరోపించారు. సెక్రటేరియట్ కు వెళ్లినా, ఇంటికి వెళ్లినా రానివ్వడం లేదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అహంకారపూరిత ధోరణి ఈ సందర్బంగా తెలుస్తోందన్నారు. అసలు ప్రభుత్వం అనేది రాష్ట్రంలో ఉందా అన్న అనుమానం కలుగుతోందని ఆవేదన చెందారు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. పలుమార్లు తనను కలిసేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
సీఎం వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న జైపాల్ రెడ్డి తనను అవమానించేలా వ్యవహరించారంటూ ఆరోపించారు. తనను సీఎంఓ కార్యాలయం అవమానించిందని వాపోయారు. తాను రేవంత్ రెడ్డ కలిసేంత దాకా వెళుతూనే ఉంటానన్నారు. తన నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పిటిషన్లు ఇచ్చేందుకు వెళ్లానని అన్నారు.