చంద్రబాబుపై నిప్పులు చెరిగిన చింతా మోహన్
కర్నూలు జిల్లా – మాజీ ఎంపీ చింతా మోహన్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. అమరావతి పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. రాజధాని నిర్మాణం కోసం రూ. 60 వేల కోట్ల అప్పులు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రం దివాళా అంచున ఉందని, ఆరు గ్యారెంటీలు అమలుకు లక్షల కోట్లు కావాల్సి ఉంటుందన్నారు. ఈ తరుణంలో కేపిటల్ సిటీకి ఇన్ని కోట్లు తీసుకు వస్తే ఎలా అని ప్రశ్నించారు.
కర్నూలులో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఏపీని జగన్ రెడ్డి నాశనం చేస్తే, చంద్రబాబు వచ్చాక బడా బాబులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు . అడ్కో నుంచి 11 వేల కోట్ల రూపాయలు, 9 శాతం వడ్డీతో 15 సంవత్సరాల కాల పరిమితితో చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని అన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ, అసలు లో కొంత చెల్లించేలా అంగీకారం కుదిరిందన్నారు.
కర్నూలు పరిస్థితే అమరావతికి వస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ చింతా మోహన్. 1953లో మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరు పడ్డప్పుడు, ఆచార్య రంగా , తరిమెల నాగిరెడ్డి తిరుపతిని రాజధాని చేయాలని కోరారని అన్నారు. సంజీవరెడ్డి కర్నూలుకు తెచ్చాడని. మళ్లీ ఆయనే హైదరాబాద్ అన్నాడు. సరేనని అందరం ఒప్పుకున్నామన్నారు
జగన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో నాశనం చేశాడని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు అమరావతి అభివృద్ధి పేరుతో ప్రపంచ బ్యాంక్, జర్మనీ, అడ్కో నుంచి అప్పులు చేసి రాష్ట్ర ప్రజలను ఏం చేయాలనుకుంటున్నాడు?? ప్రజల నెత్తిన ఇప్పుడున్న అప్పులు చాలదా?? అని నిలదీశారు.
నేను తిరుపతి రాజధానంటే నా చేతులు కట్టేశారు. జరుగుతున్న పరిణామాలను చూస్తూ సైలెంట్ గా ఉంటున్నాను. బ్రహ్మం గారు చెప్పిన మాటలు ఏదో ఒక రోజు నిజమవుతుందని నేను నమ్ముతున్నానని అన్నారు..