క్రమశిక్షణ తప్పిన చిన్నారెడ్డి
హైదరాబాద్ – మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీపై సీరియస్ ఆరోపణలు చేయడం కలకలం రేపింది. పార్టీలో రెడ్లు, అగ్ర కులాలకు చెందిన వాళ్లు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డే క్రమశిక్షణ తప్పాడని ఆరోపించారు.
సొంత పార్టీ ఎమ్మెల్యే మేఘా రెడ్డిపై బహిరంగంగా ఆరోపణలు చేశాడని, మరి ఆయనపై క్రమశిక్షణ చర్యలు ఉండవా అని ప్రశ్నించారు. కులగణన మీద బీసీ నాయకులతో రేవంత్ రెడ్డి మీటింగ్ పెడితే దానికి జానారెడ్డిని, కేశవరావును పిలిచారు కానీ బీసీ నాయకుడినైనా నన్ను పిలవలేదంటూ మండిపడ్డారు.
బుధవారం మధు యాష్కి గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా జనాభా పెరుగుతుందే తప్పా తగ్గుతుందా అని ఎద్దేవా చేశారు. పార్టీ కోసం కష్ట పడిన వారికి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా మధు యాష్కి గౌడ్ కాంగ్రెస్ అగ్ర నేత, రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. తాను హైకమాండ్ కు తెలియ చేయకుండా చిన్నారెడ్డిని టార్గెట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.