లాయర్లను అనుమతించని పోలీసులు
అమరావతి – మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి కాకినాడ పోర్టులో వాటాల బదిలీ కేసుకు సంబంధించి విజయవాడ సీఐడీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. కేసులో ఏ1గా ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి కూడా ఉన్నారు. కాకినాడ పోర్టులో వాటాలను అక్రమంగా బదిలీ చేయించుకున్నారంటూ ఇద్దరిపై కేసు నమోదైంది. ఈ సందర్బంగా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా విజయ సాయి రెడ్డి తప్ప మరెవరినీ పోలీసులు లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీనిపై తీవ్రంగా మండిపడ్డారు. పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
విజయవాడలోని సీఐడీ రీజనల్ కార్యాలయానికి కాసేపటి క్రితం ఆయన చేరుకున్నారు. విజయసాయి మినహా మరెవరినీ సీఐడీ అధికారులు లోపలకు అనుమతించలేదు. ఆయన వెంట వచ్చిన న్యాయవాదులను కూడా ఆపేశారు. వాటాల బదిలీ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులపై విజయసాయిని సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
కాకినాడ పోర్టు అధిపతి కేవీ రావును బెదరించి అక్రమంగా వాటాలను తీసుకున్నారనే అభియోగాలతో ఈ కేసు నమోదయింది. ఈ కేసులో ఏ1గా వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, ఏ2గా విజయసాయిరెడ్డి, ఏ3గా శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. ఇదే కేసులో విజయసాయిని ఇప్పటికే ఈడీ విచారించింది. తాజాగా ఈరోజు ఆయనను సీఐడీ విచారిస్తోంది. ఇటీవలే వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో నేటి సీఐడీ విచారణలో విజయసాయి ఏం చెబుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది