ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు నోటీసులు
హైదరాబాద్ – ఫార్ములా ఇ కారు రేసు కేసుకు సంబంధించి ఈడీ దూకుడు పెంచింది. ఎవరి ఆదేశాల మేరకు కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి బదిలీ చేశారో చెప్పాలంటూ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు నోటీసులు జారీ చేసింది. మరో వైపు కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ హైకోర్టును ఆశ్రయించింది. తాము ఆదేశాలు ఇచ్చేంత వరకు అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశించింది.
ఇదిలా ఉండగా ఫార్ములా ఈ కారు రేస్ కు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తరపు న్యాయవాది కీలక వాదనలు వినిపించారు కోర్టులో. తన సంతకమే లేనప్పుడు తాను ఎలా బాధ్యుడు అవుతాడని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని జడ్జికి తెలిపారు.
ఎక్కడా ఒక్క పైసా కూడా పక్కదారి పట్టిన దాఖలాలు లేవన్నారు. గతంలో అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారమే డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు. మరి ఎక్కడ అవినీతి చోటు చేసుకుందో ఏసీబీ చెప్పాలన్నారు. కేవలం కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి తన క్లయింట్ కేటీఆర్ ను టార్గెట్ చేశారంటూ ఆరోపించారు.