మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ ఝలక్
జనవరి 7న హాజరు కావాలని ఆదేశం
హైదరాబాద్ – కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది మాజీ మంత్రి కేటీఆర్ కు. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. 2,3 తేదీల్లో విచారణకు రావాలని పేర్కొంది.
ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. దీనిని సవాల్ చేస్తూ కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 31 వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశించింది కోర్టు.
మరోవైపు కేసుకు సంబంధించి విచారణను వేగవంతం చేసింది ఏసీబీ. ఇప్పటికే హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిషోర్ వాంగ్మూలాన్ని తీసుకుంది. ఆయన నుంచి పత్రాలను స్వీకరించింది. కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ అనుమతి తీసుకుంది ఏసీబీ.
ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఏసీబీకి కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే ప్రకటించారు కేటీఆర్. తనపై కక్ష సాధింపుతోనే ఇలా చేస్తున్నారంటూ ఆరోపించారు.