లైన్ క్లియర్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అత్యంత ఆధునిక సదుపాయాలు, వసతి సౌకర్యాలతో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించాలని స్పష్టం చేశారు. తన ఆధ్వర్యంలో సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. ఉస్మానియా ఆస్పత్రికి ఘనమైన చరిత్ర ఉందన్నారు. గత కొంత కాలంగా ఈ ఆస్పత్రికి రోగుల రాక పెరిగిందన్నారు. దీంతో సేవలు అందించేందుకు ఇబ్బంది ఏర్పడుతోందన్నారు. 31న ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు.
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వైద్య రంగంలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి. ఇప్పటికే తమ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడుతోందని చెప్పారు. ప్రధానంగా విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనపై ఎక్కువగా దృష్టి సారించామని అన్నారు సీఎం.
ఎక్కడ కూడా రాజీ పడడం లేదన్నారు. పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.