కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ గ్రాఫ్ పడిపోతందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో జరిగిన మూడు గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా ఓటు వేసిన గ్రాడ్యుయేట్స్, టీచర్లకు, మేధావులకు ధన్యవాదాలు తెలిపారు. అధికార పార్టీని ఎవరూ నమ్మలేదని అన్నారు. ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వడం, ప్రజలను మోసం చేయడం పనిగా పెట్టుకున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు జెండా ఎగుర వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి. ఈ విజయం చిరస్మరణీయమని అన్నారు . ఈ గెలుపుతో తమపై మరింత బాధ్యతను పెంచేలా చేసిందని చెప్పారు.
ఇదే సమయంలో తనపై లేనిపోని ఆరోపణలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి గురించి పల్లెత్తు మాట అనక పోవడం విశేషం. అన్నీ ప్రజలు గమనిస్తున్నారని, అన్నింటికి కాలమే సమాధానం చెబుతుందని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి.