బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చిన భక్తులు
తిరుపతి – శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా విశేషమైన గరుడ వాహన సేవ రాత్రి 7 గంటల నుండి అత్యంత వైభవంగా జరిగింది.
స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, కేరళ కళాకారుల వాయిద్యాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.
వాహన సేవలో టీటీడీ అదనపు ఈవో శ సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు, జేఈవో వీరబ్రహ్మం దంపతులు, ఆలయ ప్రత్యేకాధికారి మరియు సిపిఆర్వో డా.టి.రవి, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో శ గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్, ధన శేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.