Saturday, May 24, 2025
HomeDEVOTIONALగజవాహనంపై శ్రీ కోదండ‌రాముడు

గజవాహనంపై శ్రీ కోదండ‌రాముడు

భ‌క్తుల‌కు అభ‌యం ఇచ్చిన స్వామి

తిరుప‌తి – తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఆరో రోజు రాత్రి 7 గంట‌ల‌కు స్వామి వారు గజ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.

సనాతన హైందవ ధర్మంలో గజ వాహనానికి విశిష్ఠ ప్రాధాన్యత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో కానీ, రాజ దర్బాలలో కానీ, ఉత్సవాల్లో కానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహనసేవలో భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై ఉంచుకుంటే స్వామి కృపకు పాత్రులు అవుతారని ఈ వాహన సేవ తెలుపుతుంది.

ఇదిలా ఉండగా, మధ్యాహ్నం 3 గంటలకుశ్రీ సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీ కోదండ రాముల వారి ఉత్సవ మూర్తులకు వసంతోత్సవం, ఆస్థానం నిర్వహించారు. వాహన సేవల్లో ఊరేగి అలసిన స్వాములకు ఉపశమనం కల్పించడానికి వసంతోత్సవం నిర్వహిస్తారు.

వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో ర‌వి, సూపరింటెండెంట్ మునిశంక‌ర్‌, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments