Monday, April 21, 2025
HomeNEWSANDHRA PRADESHస్వచ్చాతా హీ సేవ లక్ష్య సాధనలో డ్రోన్ల వినియోగం

స్వచ్చాతా హీ సేవ లక్ష్య సాధనలో డ్రోన్ల వినియోగం

స్వచ్ఛంధ్రా కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు

అమ‌రావ‌తి – స్వ‌చ్ఛంధ్రా కార్పొరేష‌న్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ గంధం చంద్రుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. స్వచ్చాతా హీ సేవ లక్ష్య సాధనలో డ్రోన్ సేవలను వినియోగించు కోనున్నట్లు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు క్రింద రాష్ట్రంలోని వివిధ నగర పాలక సంస్ధలలో డ్రోన్ సేవలను ప్రతిపాదించామ‌ని పేర్కొన్నారు.

మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎపి డ్రోన్స్ కార్పొరేషన్‌తో మద్దతుతో పరిశుభ్రత లక్ష్య యూనిట్ల గుర్తింపు, ఇతర కార్యక్రమాల కోసం డ్రోన్‌ సేవలు ప్రవేశ పెడుతున్నామని చెప్పారు.

తిరుపతి, రాజమండ్రి, వైజాగ్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగర పాలక సంస్ధలలో డ్రోన్ సేవలను ఉపయోగించాలని ప్రాధమికంగా నిర్ణయించామని తెలిపారు. ఇప్పటికే అయా నగర పాలక సంస్ధలలో వీటి వినియోగం ప్రారంభించిన‌ట్లు వెల్ల‌డించారు గంధం చంద్రుడు.

స్వచ్చాతా హీ సేవ నేపధ్యంలో పరిశుభ్రత లక్ష్య యూనిట్ల ఎంపికతో పాటు పనులు పూర్తి అయిన తరువాత తనిఖీ చేయడానికి డ్రోన్లు ఎంతో ఉపయోగ పడతాయని పేర్కొన్నారు.

ప్రమాణాల మేరకు పరిశుభ్రత లక్ష్య సాధన కోసం నిర్ధేశించుకున్న ప్రదేశాలు శుభ్రం చేయబడ్డాయా, లేదా అన్న విషయాలను పర్యవేక్షించడానికి స్వచ్చాతా హీ సేవ కార్యక్రమాలలో భాగంగా డ్రోన్స్ సేవలు ఉప‌యోగించు కోవ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు.

మరోవైపు అక్టోబరు 2 వరకు జరిగే విభిన్న కార్యక్రమాల పర్యవేక్షణ, ప్రచారం కోసం డ్రోన్‌లను ఉపయోగిస్తామని, తద్వారా మెరుగైన సేవలు అందుతాయని అన్నారు.

డ్రోన్‌లను ఉపయోగించి సేకరించిన డేటాను భవిష్యత్తు అవసరాల కోసం డాక్యుమెంటేషన్ చేస్తామని ప్ర‌క‌టించారు గంధం చంద్రుడు.

మరోవైపు భారత ప్రభుత్వం స్వచ్చాతా హీ సేవ కార్యక్రమం కోసం రూపొందించిన ప్రత్యేక పోర్టల్‌తో ఈ డ్రోన్లను అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందేలా ప్రయత్నిస్తామని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments