కార్మిక శాఖ అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు
విజయవాడ – ఇ.ఎస్.ఐ హాస్పిటల్‌లో అందుతున్న వైద్య సేవలను మరింత మెరుగు పర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కార్మిక శాఖ అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు స్పష్టం చేసారు. శుక్రవారం విజయవాడ ఇ.ఎస్.ఐ హాస్పిటల్‌ను సందర్శించారు. ఓపీ రిజిస్ట్రేషన్, లాబరేటరీ, ఇన్‌పేషెంట్, అవుట్‌పేషెంట్ విభాగాలను పరిశీలించారు. రోగుల నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకుని, వైద్య సేవలు మరింత ప్రభావవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ధన్వంతరి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఆధార్ అనుసంధానం వంటి అంశాలను సమీక్షించారు గంధం చంద్రుడు. రిజిస్ట్రేషన్ వ్యవస్థను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. చందాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. హాస్పిటల్ అభివృద్ధికి అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇ.ఎస్.ఐ డైరెక్టర్ వి. ఆంజనేయులకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. వి. జ్యోతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.